- వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించి టెస్ట్‌లు చేసిన జియాలస్టులు
- మల్లంపల్లి, కమలాపూర్ మండలాల్లో 3 పీపీఎం ఉన్నట్లు నిర్ధారణ
- మిగతా చోట్ల 2 నుంచి 2.6 పీపీఎం
- గ్రౌండ్ వాటర్ తగ్గడం, వర్షపు నీటిని స్టోర్ చేయకపోవడమే కారణం
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫ్లోరైడ్ ఆనవాళ్లు బయటపడడం కలకలం రేపుతోంది. కాకతీయ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి గ్రౌండ్ వాటర్ శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు చేయడంతో ఈ విషయం బయటపడింది. నీటిలో ఫ్లోరైడ్ సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తేలింది. గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గిపోవడం, ఎక్కువ లోతుకు బోర్లు వేయడం, వ్యవసాయంలో అవసరానికి మించి పురుగుమందుల వాడడం ఫ్లోరైడ్ శాతం పెరగడానికి కారణం అని జియాలజిస్టులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75 ప్రాంతాల్లో స్టడీ
కేయూ జియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ బొడిగె సతీశ్, డాక్టర్ సాయికృష్ణ కొన్ని రోజుల కిందట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75 ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్‌పై స్టడీ చేశారు. ఆయా ప్రాంతాల నుంచి గ్రౌండ్ వాటర్‌ను సేకరించి టెస్ట్‌లు చేయగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఫ్లోరిన్ ఉన్నట్లు గుర్తించారు. డబ్ల్యూహెచ్‌వో రూల్స్ ప్రకారం లీటర్ నీటిలో 0.6 మిల్లీగ్రాముల నుంచి 1.5 మిల్లీగ్రాముల మధ్యే ఫ్లోరిన్ ఉండాలి. 0.6 పీపీఎం కంటే తక్కువగా ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండగా, 1.5 పీపీఎం కంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. జియాలజిస్టుల పరిశోధనలో ఫ్లోరైడ్‌తో పాటు నైట్రేట్, సల్ఫేట్ మోతాదు కూడా ఎక్కువగానే ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ALSO READ : కామారెడ్డి బెల్లం భలే .. తయారీ వైపు పలువురు రైతుల ఆసక్తి
మల్లంపల్లి, కమలాపూర్ మండలాల్లో డబుల్
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం, కమలాపూర్ మండలం గుండేడు నుంచి సేకరించిన వాటర్ శాంపిల్స్‌లో 3 పీపీఎం వరకు ఫ్లోరిన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే రెట్టింపు శాతంలో ఫ్లోరైడ్ ఉండడం కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 2 పీపీఎం కంటే ఎక్కువగా ఫ్లోరైడ్ ఉన్నట్లు నమోదు అయింది. ప్రధానంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరు, వరంగల్ జిల్లా చెన్నారావుపేట, నర్సంపేట, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్, జనగామ జిల్లా దేవరుప్పులలో 2.6 పీపీఎం, వరంగల్ దేశాయిపేట ఏరియాలో 2.5, కమలాపూర్ మండలం దేశరాజ్‌పల్లి, హసన్‌పర్తి మండలం ముచ్చర్ల, వేలేరు మండలం ముప్పారంలో 2, ఎల్కతుర్తి మండలం జీల్గుల, బావుపేట, సూరారంలో 2.2, భీమదేవరపల్లి మండలం వంగరలో 2.2, దామెరలో 2 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నట్లు గుర్తించారు.
గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ వల్లే...
ఉమ్మడి జిల్లాలో గ్రానైట్ ఇండస్ట్రీస్, మిల్స్, కెమికల్స్‌ను వినియోగించే పరిశ్రమల వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతోంది. దీని వల్ల నీటిలో ఫ్లోరైడ్‌తో పాటు సల్ఫేట్, నైట్రేట్, సోడియం తదితర మూలకాల మోతాదు పెరుగుతోంది. అంతేగాకుండా భూగర్భజలాలు తగ్గిపోవడం, నీళ్ల కోసం వందల ఫీట్ల లోతు వరకు బోర్లు వేయడం, వర్షపు నీటిని స్టోర్ చేయకపోవడం వల్ల కూడా ఫ్లోరైడ్ శాతం పెరిగే అవకాశం ఉందని జియాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయంలో ఫాస్పరస్, పొటాషియం, ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల కూడా ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం పెరుగుతుందని అంటున్నారు. వర్షాలు పడినప్పుడు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపడం, సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గిస్తే ఫ్లోరిన్ బారినుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.
వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ఫ్లోరిన్
వర్షపాతం తక్కువగా ఉన్న గ్రామాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. ఎక్కువ లోతుకు బోర్లు వేయడం, రాళ్ల స్వభావం వల్ల కూడా ఫ్లోరైడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా రైస్ మిల్స్ ఎక్కువగా ఉండే రాంపూర్ లాంటి ప్రాంతాల్లో సల్ఫేట్ శాతం ఎక్కువగా ఉంటోంది. వీటి వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలు కూడా ఫ్లోరైడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలి.
– డాక్టర్ బొడిగె సతీశ్, జియాలజిస్ట్-